మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి దుకాణాలు ప్రమాదానికి గురై నష్టపోయిన చిరు వ్యాపారులకు జెన్పాక్ట్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం అర్ధరాత్రి చిరు వ్యాపారులకు చెందిన దుకాణాలు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే. ప్రముఖ సామాజికవేత్త… జెన్ ఫ్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సబ్బని వెంకట్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5వేల రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే ప్రకటించడమే కాకుండా గురువారం ఉదయం హుజరాబాద్ కు వచ్చి బాధితులను స్వయంగా కలుసుకుని తన చేతుల మీదుగా అందజేశారు. అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితులు ఆర్థిక సహాయం అందించిన సబ్బని వెంకట్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 31 మంది బాధితులు ఉండగా ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ. 1.5 లక్షల రూపాయలను వెంకట్ సొంతంగా అందజేశారు. ఈ సందర్భంగా సబ్బని వెంకట్ మాట్లాడుతూ ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగి నిరుపేదలు రోడ్డున పడిన సందర్భాలు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చేతనైనంత ఆర్థిక సహాయం అందించాలన్నారు. మనసున్న దాతలు ముందుకు వచ్చి మానవతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని, బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించి తమ వ్యాపారం చేసుకునేల కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్యనరసింహారెడ్డి, పద్మశాలి సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, బాధితులు పాల్గొన్నారు.
- Home
- అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన జెన్ ఫ్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్