సింగరేణి పరీక్షలకు అంతా రెడీ!..ఈ నెల 20, 21 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు..272 ఎక్స్​టర్నల్ పోస్టులకు 18,665 మంది అప్లై

స్వర్ణోదయం ప్రతినిధి, రామగుండం: ఈనెల 20 నుంచి రెండు రోజుల పాటు జరిగే సింగరేణి పరీక్షలకు సంస్థ అన్ని ఏర్పాట్లు రెడీ చేసింది. గత మార్చి ఫస్ట్​న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొత్తం 10 కేటగిరీలలో 272 ఎక్స్​టర్నల్ పోస్టుల భర్తీకి మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20, 21వ తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరాం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షలు రాసే 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను(సీబీటీ) నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోటీ పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈడీసీఐఎస్​ ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ లో 12 ఎగ్జామ్ సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే మోసగాళ్ల వలలో పడొద్దని, శ్రమను నమ్ముకొని పరీక్షలో విజయం సాధించాలని సూచించారు. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తే విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ లో ఇబ్బందులు తలెత్తినట్లైతే హెల్ప్ డెస్క్ నెం . 08744- 249992 ను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!