స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, జులై 30: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని నాగార్జున డైరీ యజమాని పుల్లూరు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెల్చాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్ మంగళవారం హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు అడిగిన వ్యక్తి నా అనుచరుడైతే నాపై, ప్రభాకర్ రావు మనిషి అయితే తనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి- చేశారు. గత వారం రోజుల కిందట నాగార్జున పాల డైరీ చైర్మన్ పుల్లూరి ప్రభాకర్ రావుకు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తిప్పారపు సంపత్ అనుచరుడిని అని 15 లక్షల రూపాయలు అడిగిన వ్యక్తి ఎవరో తెల్చాలని, కుట్ర చేసిన వ్యక్తులు ఎవరో తేల్చాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నానన్నారు. నాపై డబ్బులు అడిగాడు అని వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తూ వాటిలో నిజం తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. గతంలో కూడా ఈటల రాజేందర్ అక్రమ ఆస్తులపై ప్రశ్నించినందుకు అనేక అక్రమ కేసులు పెట్టి 62 రోజులు నన్ను, నా అనుచరులను జైల్లో పెట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు నాగార్జున పాల డైరీ కార్మికులకు అన్యాయం జరిగిందని, నాగార్జున డైరీ పాలల్లో పాల పౌడర్ కలుపుతున్నారని ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే నాపై కుట్ర చేశారని, ఒక వ్యక్తి నా అనుచరుడు 15 లక్షలు అడుగుతున్నారని ఒక ఆడియో రిలీజ్ చేసి తన పరువు తీసాడన్నారు. దళితులు దొరలను ప్రశ్నించడమే నేరమైతే ? ప్రశ్నించిన ప్రతిసారి మా పై అక్రమ కేసులు పెడితే ఈ ప్రజాస్వామ్యంలో మా పాత్ర ఏంటి అని మేము అడుగుతున్నామన్నారు. దళితులను కాపాడవలసిన చట్టాలే దళితులను నేరస్తులను చేస్తే ఈ సమాజంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నారు. పుల్లూరి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తేల్చాలని ఎవరెవరు ఆ కుట్రలో భాగస్వాములైనరో తేల్చాలని నా అనుచరుడే డబ్బులు అడిగి ఉంటే నాపై కూడా కేసు నమోదు చేయాలని, లేదా నాగార్జున డైరీ చైర్మన్ ప్రభాకర్ రావు కుట్ర చేసి ఉంటే తనపై కేసు నమోదు చేయాలని ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని హుజురాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.