
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఇల్లందకుంట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇల్లందకుంట మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యులు ప్రతి పల్లెలో పర్యటనలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించి ఎలాంటి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని బీజేపీ యువ మోర్చా సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఉన్నత వైద్యాధికారులు వెంటనే ఇల్లందకుంట మండలాన్ని సందర్శించి కావలసిన వైద్య సదుపాయాలను డెంగ్యూ కిట్లను డెంగ్యూ పరీక్ష చేసేందుకు సరిపడా సౌకర్యాలను కల్పించాలన్నారు. పల్లె వైద్యులు ఉదయమే 9 గంటలకు ఆ గ్రామాలకు చేరుకొని నిత్యం వైద్య పరీక్షలు చేస్తూ వీలైన ఎక్కువగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ అప్రమత్తంతో ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వైద్యాధికారులు ఉదయమే ఆయా గ్రామాలకు చేరుకొని పరీక్షలు నిర్వహించడంతో పాటుగా పల్లె డాక్టర్లకు ఏ గ్రామంలో అయితే పనిచేస్తున్నారో ఆ గ్రామాల్లో మాత్రమే పని చేయాలన్నారు. ఉన్నతాధికారులు వేరే గ్రామాలకు డ్యూటీ వేయకుండా ఆ గ్రామంలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఉన్నత వైద్యాధికారులు ప్రతిరోజు ఇల్లందకుంట మండలాన్ని సమీక్షిస్తూ ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ లు తెప్పించుకొని వైద్యుల పనితీరు సమీక్షిస్తూనే విష జ్వరాల నుండి ఇల్లందకుంట మండల ప్రజలందరినీ కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ఒకవేళ మీరు ఇలాగే అలసత్వం వహిస్తే గ్రామస్థాయి మరియు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం తరపున కలెక్టర్ కు కూడా విజ్ఞప్తి చేస్తామన్నారు. పనితీరు బాగోలేని వైద్యాధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలో సరైన శానిటేషన్ పరిసరాల శుభ్రంగా ఉంచే విధంగా గ్రామ సిబ్బందినీ కూడా అప్రమత్తం చేయాలని బీజేపీ యువ మోర్చ సీనియర్ మట్ట పవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
