మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ జీవితాలను కాపాడుకోవాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి అన్నారు. మంగళవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పై అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. ఎంతోమంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదాల్లో మరణించారని అన్నారు. అలాగే నెంబర్ ప్లేట్ ప్రతి వాహనానికి ఉండాలని లేకపోతే వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు వాహనంకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు వాహనం వెంటే ఉంచుకోవాలన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితిలోనూ వాహనం నడపరాదని అన్నారు. తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ వాహనం నడిపిన భారీ జరిమానతో పాటు శిక్ష తప్పదని హెచ్చరించారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కూడా చాలామంది వాహనాలు నడుపుతున్నారని అలా చేయకూడదని ఎంత ముఖ్యమైన విషయం అయినప్పటికీ ప్రాణాలు కంటే ముఖ్యం కాదని అన్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని అన్నారు. తాగి వాహనం నడిపి ప్రమాదం జరిగితే తనతోపాటు తన కుటుంబానికి కూడా తీరని అన్యాయం జరుగుతుందని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్, ఎస్సై షేక్ యూనస్, మహమ్మద్ అలీ పాల్గొనగా ప్రముఖ సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం చేయడం గమనించి ఎసిపి ఆయనను అభినందించారు. పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Home
- ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.! జీవితాలు కాపాడుకోండి. -హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ