స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాలు జలదిగ్భందం కాగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షం భీభత్సం సృష్టిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటీకి రేపు (సోమవారం) సెలవు ప్రకటించింది.
భారీ వర్షాలు, వరదల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో సహయక చర్యలకు ఆటంకాలు ఏర్పడకుండా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సెలవులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. వరదలపై పరిస్థితిని సంబంధిత అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యల కోసం హెలికాప్టర్ల కావాలని నేవీకి రిక్వె్స్ట్ చేశామని తెలిపారు. ప్రజలు అత్యవరసరమైతేనే బయటకు రావాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని హైవేలు, రహదారులపై వాగులు పొంగి పొర్లుతున్నాయని.. ప్రమాదకరమైన రోడ్లపై వెహికల్స్ను అలౌవ్ చేయొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు సహయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.