
–మహేష్ కు అభినందనల వెల్లువ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ సెప్టెంబరు 5: పంజాబ్ లోని జలంధర్లో ఈనెల 9 నుండి 19వ తేదీ వరకు జరిగే 14వ భారత జూనియర్ హాకీ బాలుర జాతీయస్థాయి ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో తెలంగాణ జట్టు తరఫున ఆడేందుకు హుజురాబాద్ క్రీడాకారుడు తలకొక్కుల మహేష్ ఎంపికయ్యాడు. మహేష్ గతంలో కరీంనగర్ జట్టు తరఫున రాష్ట్రస్థాయి జూనియర్ టోర్నమెంట్లో ఆడి విశేష ప్రతిభ కనబరిచి ప్రస్తుత జాతీయస్థాయిలో ఆడేందుకు తెలంగాణ జట్టుకు ఎంపికయ్యాడు. హుజురాబాద్ పట్టణానికి చెందిన తలకొక్కుల చిరంజీవి చంద్రకళ దంపతుల కుమారుడైన మహేష్ తెలంగాణ జట్టు తరపున జాతీయస్థాయిలో జూనియర్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయస్థాయి పోటీల్లో కరీంనగర్ జిల్లా తరఫున ఎంపికైన సందర్భంగా హుజురాబాద్ కు చెందిన తలకొక్కుల మహేష్ ను కరీంనగర్ హాకీ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి సురేందర్ సింగ్, ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి గనిశెట్టి ఉమామహేష్, సీనియర్ హాకీ క్రీడాకారుడు, కోచ్ తిరునహరి శ్రీనివాస్ లతోపాటు సీనియర్ హాకీ క్రీడాకారులు, పలువురు క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. మహేష్ ఎంపిక హుజురాబాద్ కు గర్వకారణమని పలువురు వ్యాఖ్యానించారు.






