
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని కోరుతూ.. యువజన కాంగ్రెస్ నాయకులు స్థానిక హుజూరాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా భయానక వాతావరణానికి తెరలేపి లేనిపోని గొడవలు, విధ్వంసాలు సృష్టిస్తూ ప్రాంతీయ విబేధాలు అంటూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఇరు పార్టీల నాయకులను(కాంగ్రెస్, బిఆర్ఎస్ )రెచ్చగొడుతూ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు సృష్టించి రాజకీయంగా కౌశిక్ రెడ్డి తమ పార్టీ పెద్దల వద్ద మన్ననలు పొందడం కోసం అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఎప్పటికీ ఏదోఒక వార్తల్లో నిలవడం కోసం మహిళలను కించపరుస్తూ చీర, గాజుల అంటూ మీడియా ద్వారా గొడవలు సృష్టిస్తున్నారన్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తుల పట్ల తెలంగాణ సమాజాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందమల్ల నరేష్, టేకుల శ్రావణ్, నాయకులు బండ నవీన్, జంగ అనిల్, లంకదాసరి గంగరాజు, ఇప్పలపల్లి చంద్రశేఖర్, నరెడ్ల వినోద్ రెడ్డి, చల్లూరి విష్ణు వర్ధన్, చెంచల మణిదీప్, జన్ను ప్రసాద్, ఆకునూరి అజిత్, నాగరాజు, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.
