–ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే
మీకు కంటగింపేందుకు..?
–అధికారులపై దాడి అత్యంత దుర్మార్గం ..
–అభివృద్ధి కంటకులను
కూకటివేళ్లతో పీకేయాలని
ప్రజలే ఆకాంక్షిస్తున్నారు..
–రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పొద్ధా..
–నిరుద్యోగ యువతకు
ఉద్యోగాలు కల్పించొద్దా..
–అభివృద్ధిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటయ్..
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కేటీఆర్ కు హెచ్చరిక.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడు లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి పనులు చేపడుతుంటే ట్విట్టర్ టిల్లు అమాయక ప్రజలను రెచ్చగొడుతూ కుట్ర పన్నుతూ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు లాగచర్లకు వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వ అధికారులపై కిరాయి, మూకలు రౌడీలు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకే వెళితే అత్యంత దుర్మార్గంగా దాడి చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలు ఆఫ్రికాలోని బనానా రిపబ్లిక్ లాలో కూడా చోటు చేసుకోవని తెలిపారు.
గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ఇక్కడి యువతకు ఉద్యోగ కల్పన చేయవద్ధా. పరిశ్రమలు నెలకొల్ప వద్ధా.. అభివృద్ధి పనులు చేయకూడదా.. అని కేటీఆర్ ను ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ బందిపోట్ల లాగా అమాయక ప్రజలను రెచ్చగొట్టడం ఏంటి అని ప్రశ్నించారు. వాళ్లు మావాళ్లే అయితే ఏంటి అరెస్టు చేసుకోండి.. మేము చార్లెస్ సోభ్రాజ్ లాగా ఫేమస్ అయిపోతామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. తమకు మహాత్మా గాంధీ కి వచ్చిన సింపతి వస్తదని గల్లా ఎగురేస్తున్నా రని పేర్కొన్నారు. వీధి రౌడీ వేషాలేస్తూ అభివృద్ధి కంటకులు, ఇలాంటి చీడపురుగులను కూకటివేళ్లతో పీకేయాలని ప్రజలే ప్రభుత్వాన్ని కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులపై అత్యంత దుర్మార్గంగా దాడి చేయడం సరైనది కాదని, ఇలాంటి విష సంస్కృతిని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రోత్సహించవద్దని హితవు పలికారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇలాగే చేస్తూ ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుంటే, ఎక్కడ తమ ఉనికి కోల్పోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 1200 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుచేసి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే, ఏదో జరిగిపోతుందని కుట్రలు పన్నుతూ అమాయక ప్రజలను రెచ్చగొడుతు న్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటూ అభివృద్ధి కంటకులుగా బీఆర్ఎస్ నేతలు మారవద్దని, ప్రజలే మీకు గట్టి గుణపాఠం చెప్తారని వెలిచాల రాజేందర్ రావు హెచ్చరించారు.