
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జనవరి 29: దళితబంధు రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..తెలంగాణతొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారన్నారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత నిధులు దళితులకు అందాయని, ఎన్నికల కోడ్ వల్ల రెండో విడత నిధులు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, దళితబంధు రెండో నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుండి ఇప్పటి వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేసి, ప్రభుత్వం మెడలు వంచి, దళితబంధు రెండో విడుత నిధులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చేశారని అన్నారు. అంబేద్కర్ సాక్షిగా దళితుల కోసం పోరాటాలు చేసి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నారని, అలాగే దళిత బంధును ప్రవేశపెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కు సైతం పాలాభిషేకం చేస్తే బాగుండేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ముక్క రమేష్, మారెపెల్లి సుశీల, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మొలుగు పూర్ణచందర్, కేసరి మధుకర్ రావు, మోరే మధు, ఎర్ర శ్రీధర్, మహిళా నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.



