
స్వర్ణోదయం // ఫిబ్రవరి 21// కుమార్ యాదవ్//ఇల్లందకుంట: హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండల పరిధిలో భర్తతో జరిగిన విభేదాల కారణంగా జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి తన పది నెలల పాపతో కలిసి ఆత్మహత్యకు సిద్ధమైన ఘటన ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సిరిసేడు గ్రామానికి చెందిన పల్లెర్ల రుచిత (W/o అరవింద్) ప్రేమ వివాహం చేసుకుని, వివాహానంతరం కుటుంబ కలహాలతో గత రెండు నెలలుగా తన తల్లి నక్క సువర్ణ వద్ద ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో తల్లికి ఫోన్ చేసి డబ్బులు కావాలని చెప్పిన రుచిత, కొద్ది సమయానికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి వెళ్లగా కనబడకపోవడంతో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భయపడి తల్లి నక్క సువర్ణ, మధ్యాహ్నం ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందుకున్న వెంటనే ఎస్సై స్పందించి రుచిత మొబైల్‌ను ట్రేస్ చేసి, ఆమె గమ్య స్థానాన్ని గుర్తించి పెద్దంపల్లి గ్రామ శివారులో రుచితను ఆమె పాపతో కలిసి గుర్తించి రక్షించారు. పోలీసులు ఆమెను విచారించగా “భర్తతో జరిగిన గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది పాపతో కలిసి చావాలని అనుకున్నాను” అని తెలిపింది. పోలీసులు ఆమెకు, ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి, అనంతరం తల్లి సువర్ణకు అప్పగించారు. పోలీసులు తక్షణము స్పందించి వేగవంతమైన చర్యలు తీసుకోని ఇల్లందకుంట ఎస్సై రాజ్ కుమార్ రెండు నిండు ప్రాణాలను కాపాడారు.


