
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందన్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలన్నారు. దాడుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. మహిళ జర్నలిస్టులకు రాత్రి పూట ప్రత్యేక రవాణా సదుపాయాం కల్పించాలన్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇచ్చిన నివేషణ స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించి అందులో నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వాలన్నారు. హుజురాబాద్ లో ఇచ్చిన స్థలాలపై వేసిన కోర్టు కేసును ఉపసంహరింపజేసి ఇళ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు అందించాలన్నారు. పలు సమస్యలపై చేపట్టే నిరసన కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
