
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 24 : హుజురాబాద్ మండల సహాయ కార్మిక అధికారి చందన నెల రోజుల పాటు సెలవులో ఉండటంతో, కార్యాలయంలో పేరుకుపోయిన పెండింగ్ క్లైమ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన ఇన్ఛార్జ్ అధికారిని నియమించింది. కరీంనగర్‌కు చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్ఓ) మహమ్మద్ రఫీ గురువారం హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఏఎల్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త లేబర్ కార్డులు, వివాహ కానుక, మెటర్నిటీ కానుక, సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణం వంటి వివిధ కార్మిక సంక్షేమ పథకాలకు సంబంధించిన క్లైమ్లు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో పనిచేసిన అధికారి సెలవులో వెళ్లడంతో ఈ పెండింగ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రఫీకి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కధిరే రమేష్ పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న క్లైమ్లను త్వరితగతిన పరిష్కరించడానికి నూతన అధికారి కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల కార్మికులకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఏఎల్ఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, సాధ్యమైనంత వరకు త్వరితగతిన క్లైమ్ల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కార్మిక శాఖ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని కార్మికులు ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పల్లా తిరుపతి, ఇమ్మడి చక్రపాణి, రుద్రారం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

