
స్వర్ణోదయం ప్రతినిధి,హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. అంటే 5-8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొంత ఆలస్యమైతే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళకే జూన్ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటిన విషయం తెలిసిందే. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు.