
-ఎన్నికల హామీలు అమలు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి. వాసుదేవ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రోజున ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆవరణలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ
తాము అధికారంలోకి వస్తే ఒక్కోరైతుకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని, రైతు భరోసా కింద ఎకరానికి 15000వెలు ఇస్తామని, ధాన్యం క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని, ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు కేటాయిస్తామని, స్థలం ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి చెల్లిస్తామని, కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు మరియు తులం బంగారం చెల్లిస్తామని, ఇలాంటి వాగ్దానాలు అనేకం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వడ్లు పండించే ప్రతి రైతుకు క్వింటాల్‌కు 500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం సరికాదన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు ఖర్చు ఎక్కువ వస్తుందని రోగాలు కూడా పంటకు ఎక్కువ వస్తాయని ఆ పంట పండించడానికి రైతులు తక్కువ శాతం మొగ్గు చూపుతారని ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. నూటికి 80 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని అధికారిక గణాంకాలు కూడా చెబుతున్నాయన్నారు. అలాంటిది సన్న వడ్లకే 500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించకుంటే రైతుల నుండి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత తప్పదన్నారు. బోనస్ అనేది బోగస్ కాకూడదన్నారు. రాష్ట్ర రైతులను మోసం చేస్తే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారు అన్నారు. గొర్రెల పంపిణీ పథకం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గతంలో తీసుకున్న చెక్కులు వాపస్ ఇస్తామని చెప్పడం ప్రభుత్వ దివలా కోరుతనానికి నిదర్శనం అన్నారు. గతంలో లాగానే గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టినప్పటికీ గత ప్రభుత్వం అరులైన పేదలకు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఈ ప్రభుత్వంలోనైనా పూర్తయిన ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికి కేటాయించకుండా ఉంటే అవి నిరుపయోగంగా ఉంటున్నాయని శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు.
రైతాంగానికి నాణ్యమైన ఎరువులు పురుగు మందులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్ జోన్ కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, నాయకులు సిరికొండ మదనయ్య, మారేపల్లి కిరణ్, కొడారి సురేష్, జక్కుల సాయిరాం, కల్లూరి శ్రీనివాస్, పుల్ల రజాక్, నానవేని సురేష్, చల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
