
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు యెదులాపురం రామబ్రహ్మం కుమారుడు యెదులాపురం రంజిత్ కుమార్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాను అందుకున్నారు. పరిశోధనా సంస్థల విభాగంలో ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) జాతీయ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచిన ‘అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్’ (AcSIR) సంస్థ నుంచి ఆయన ఈ డిగ్రీని పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థ CSIR–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT)లో UGC-NET జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించి రంజిత్ కుమార్ తన డాక్టరల్ పరిశోధనను పూర్తి చేశారు. ఆయన ప్రధానంగా నానోస్ట్రక్చర్డ్ ఐరన్ ఆక్సైడ్లు, ఎంట్రోపీ-ఇంజినీర్డ్ స్పినెల్ ఫెర్రైట్ల తయారీ-విశ్లేషణతో పాటు అయస్కాంత, శక్తి నిల్వ (Energy Storage) అనువర్తనాలపై విశేష పరిశోధనలు జరిపారు.
ఈ పరిశోధనల ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో రంజిత్ కుమార్ రాసిన 17 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన ఆయన, ఉన్నత పరిశోధన రంగంలో ప్రతిష్ఠాత్మక పీహెచ్డీ సాధించడంపై కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజిత్ కుమార్ సాధించిన ఈ విద్యా విజయం హుజూరాబాద్ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని స్థానికులు కొనియాడారు.





