
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ మండల పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు సోమవారం క్రీడా పోటీలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మండల విద్యాధికారి (ఎంఈఓ) విడపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.


పోటీల్లో దివ్యాంగ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా పాల్గొనడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా పోటీల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని, తాము కూడా అన్ని రంగాల్లో రాణించగలమనే నమ్మకం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సహాయక ఉపకరణాలతో పాటు ఈ రకమైన పోటీలు నిర్వహించడం వల్ల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.


వివిధ విభాగాల్లో పోటీలు:
ఈ సందర్భంగా విద్యార్థులకు కుర్చీ పరుగు, రన్నింగ్, ఫ్రాగ్ జంప్, క్యారమ్స్, డ్రాయింగ్, బకెట్ ఇన్ ద బాల్ వంటి పలు క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలు పూర్తయిన తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ డీఎం శోభారాణి, ఐఈఆర్పీ దిడ్డి జ్యోతి, స్పెషల్ ఎడ్యుకేటర్లు పైడాకుల సదయ్య, రావుల స్వాతి, ఫిజియోథెరపిస్ట్ ఐలేని స్వప్న, సీఆర్పీ తాళ్లపల్లి అమరేందర్లతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.





