
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
విద్యార్థుల యువకుల జీవితాలకు పెనుముప్పుగా మారిన భవిష్యత్తుకు అడ్డంకిగా తయారైన మత్తుకు దూరంగా ఉండాలని, దానికి బానిసైతే భవిష్యత్తు చిత్తు అవుతుందని హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి పేర్కొన్నారు. బుధవారం హుజురాబాద్ మండలం సింగాపూర్ లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ పై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ తో ఎదురయ్యే అనర్థాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ఏసిపి శ్రీనివాస్ జి మాట్లాడుతూ…. మత్తుకు యువత దూరంగా ఉండాలని, ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు భవిష్యత్తులో గొప్పవారు కావాలని ఉన్నత చదువులు ఖర్చుకు వెనకాడకుండా చదివిస్తున్నారని అన్నారు. దానిని దుర్వినియోగం చేయకుండా సక్రమమైన మార్గంలో దురలవాట్లకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. మొదట స్నేహితులు మత్తు పానీయాలను మెల్లగా అలవాటు చేస్తారని తర్వాత మెల్లమెల్లగా మనం దానికి బానిసవుతామని అనంతరం డ్రగ్స్, గంజాయి ఇలా అన్నిటికీ అలవాటు పడిపోతామని చెప్పారు. డ్రగ్స్ వాడడం ఆరోగ్య రిత్యా మంచిది కాదని ప్రభుత్వం సైతం దానిని నిషేధించిందని తెలిపారు. పోలీసులము డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నామని ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రొఫెషనల్ కాలేజస్ వృత్తి విద్యా కళాశాలలో ప్రతి విద్యార్థి కూడా ఉన్నత ఆశయాలు ఉన్నత లక్ష్యాలు సత్ప్రవర్తనతో చేరుతాడని తమ బంగారు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడని ఎన్నో కలలు కంటాడని చెప్పారు. ఎంతోమంది విద్యార్థులు కళాశాల నుండి విజయవంతముగా చదువును పూర్తి చేసి సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదుగుతారని దేశ విదేశాలలో మంచి పేరు తెచ్చుకుంటారని అన్నారు. వారిని అభినందించారు. కొంతమంది పిల్లలు చెడు స్నేహం వలన చెడు అలవాట్లకు బానిసలు అవుతారని ఈ అలవాట్ల వలన వారు తమ మనసుపై నియంత్రణ కోల్పోతారని ఆరోగ్యము పాడవుతుందని ఆర్థికంగా ఎంతో బలహీన పడతారని అన్నారు. పాకెట్ మనీ సరిపోవడం లేదని దొంగతనాలు చేసే యువత తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృత్తి విద్య చదివే విద్యార్థులు అనగా ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలగు ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు ఈ చెడు అలవాట్లకు తొందరగా బానిస అవుతారని అన్నారు. విద్యార్థి మత్తుపదార్థాలకు బానిస అయితే అతనికి కోర్టు ప్రకారం శిక్ష విధించి ఆ తరువాత అతను మత్తు పానీయాలు మానేసే విధంగా అతనికి తగిన సహాయ సహకారాలు పోలీస్ శాఖ అందిస్తుందని వారికి ప్రవర్తన మంచిగా ఉంటే ఉద్యోగం కూడా ఇప్పిస్తామని, విద్యార్థులు ఎవరైనా మత్తు పానీయాలు సేవిస్తున్నారని అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అనంతరం హుజురాబాద్ టౌన్ సిఐ బొల్లం రమేష్ మాట్లాడుతూ మత్తు పానీయములు కలిగి ఉన్నా కూడా మత్తు పానీయములు సేవించవలేనని ఇతరులను బలవంత పెట్టిన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షార్హుడని, మూడు నెలల వరకు బెయిల్ కూడా రాదని తెలిపారు. సంవత్సరం వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుందని, ఉద్యోగం వచ్చినప్పుడు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవడం అసాధ్యం అవుతుందని, మత్తు పానీయాలకు బానిస కాకూడదని కోర్టులు కఠినంగా శిక్షిస్తాయని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి తమ సత్ప్రవర్తనతో కళాశాలకు మంచి పేరు తేవాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఈశ్వరయ్య, డాక్టర్ యోగేష్ పుండలిక్ , మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ ,హుజురాబాద్ రూరల్ సీఐ పి వెంకట్, జమ్మికుంట సిఐ వి రవి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, తిరుపతి, ఆరోగ్యం, కళాశాల యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


