మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆధిపత్యం కోసం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయకుండా సంవత్సర కాలం పాటు కాలయాపన చేస్తున్నారని వెంటనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి
మిలుకూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సంవత్సర కాలంగా కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయకుండా ఉండడం మూలంగా చెక్కుల నిర్నిత గడువు ముగిసి మళ్లీ పక్షం రోజుల క్రితం కొత్త చెక్కులు వచ్చినప్పటికీ పంపిణీకి చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రోటోకాల్ పేరుతో లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే చెక్కులు పంపిణీ చేయాలని, వారం రోజుల్లో పంపిణీ చేయని యెడల లబ్ధిదారులతో కలిసి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలో కాలిపోయిన గుడిసె బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతో దేశవ్యాప్తంగా ఆరు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ధారాధత్వం చేసిందని, 200 బొగ్గు బ్లాక్ లను ప్రైవేటుపరం చేసిందన్నారు. దేశంలో నిరుద్యోగం తారస్థాయికి పెరిగిందన్నారు. దేశభక్తి ముసుగులో దేశ సంపదను ప్రైవేట్ పరం చేస్తూ మతోన్మాద రాజకీయాలు చేస్తుందన్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇవ్వాలన్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నప్పటికీ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ద్వారా ఖరీఫ్ సీజన్ గాను ఎకరానికి 7500 రైతుల అకౌంట్లో వేయాలని, వ్యవసాయ కూలీలకు 12వేలు, కౌలు రైతులకు 15వేలు నేరుగా అకౌంట్లో వేయాలన్నారు. ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, ఎవరికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్న ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని రిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని వారికి 200 గజాల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలన్నారు. నిరుద్యోగ భృతి 3116 ప్రతి నిరుద్యోగి అకౌంట్లో వేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాటినుండి నేటి వరకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదని, లక్షలాది కుటుంబాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు దూరమవుతున్నారన్నారు. వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని,
రైతు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ 500 ప్రకటించి అమలు చేయాలన్నారు. ఆన్లైన్ ఇబ్బందులతో గృహజ్యోతి పథకానికి అర్హులు కానీ వారందరికీ గృహ జ్యోతి అమలు చేయాలని, ధరణి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ పరిష్కరించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని,ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలని, ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయని, వెంటనే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెల్మారెడ్డి రాజిరెడ్డి, నాయకులు మైదంశెట్టి యుగంధర్, కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.