మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ అసలు విదేశాంగ విధానం అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలని, సంచలనాల కోసం అవాకులు, చవాకులు పేల్చడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హెచ్చరించారు. బండి సంజయ్ రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
చైనా విధానం, విదేశాంగ విధానంపై నీకు ఏమైనా పరిజ్ఞానం ఉందా..? రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అసలు గాంధీ కుటుంబం గురించి నీకేం తెలుసు అని బండి సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చైనా మద్దతుగా వ్యవహరిస్తున్నారని పేర్కొనడం బండి సంజయ్ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అని మండిపడ్డారు. 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా..? అప్పటి ప్రధానిగా వ్యవహరించిన జవహర్లాల్ నెహ్రూ చైనాను ఎలా తిప్పి కొట్టారో తెలుసా.. ? కనీస పరిజ్ఞానం లేకుండా చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే జనంలో నవ్వుల పాలు కావడం ఖాయమని హితవు పలికారు.
దేశం కోసం ఇందిరాగాంధీ తన బాడీగార్డ్ల చేతిలో హత్యకు గురయ్యారని, అలాగే రాజీవ్ గాంధీ ఎల్ టిటిఈ మిలిటెంట్ల చేతిలో చనిపోయారని గుర్తు చేశారు. దేశం కోసం తమ ప్రాణాలనే బలిదానం చేసిన గాంధీ కుటుంబంపై అవాకులు, చవాకులు పేల్చడం మానుకోవాలని హెచ్చరించారు. వాస్తవానికి లడ్డక్ లోని కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించిందని పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రకటన చేశారని, మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని ఆరోపించారు. ఆక్రమణపై చర్చిద్దామని రాహుల్ గాంధీ పట్టుబడితే మోడీ పారిపోయారని విమర్శించారు. ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. లడ్డక్ లో కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించిందని తేల్చిన రాహుల్ గాంధీ మరి బాంగ్లాదేశ్ విషయంలో రాహుల్ గాంధీ చైనాకు మద్దతుగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. చరిత్ర తెలుసుకోకుండా కనీస పరిజ్ఞానం లేకుండా సంచలనాల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజల్లో బండి సంజయ్ చులకన అవుతారని పేర్కొన్నారు. చైనాకు మద్దతుదారులు ఎవరో మీకు తెలవదా బండి సంజయ్ అని ప్రశ్నించారు. మద్దతుగా ఎవరు వ్యవహరిస్తున్నారో నీకు అర్థం కాలేదా అని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ కు స్వాతంత్రం తీసుకురావడానికి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. 1971లో అప్పటి జన సంగ్ నేత అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని పార్లమెంట్ సాక్షిగా దుర్గామాత అని కీర్తించారని తెలిపారు. ఇది కూడా బండి సంజయ్ కి తెలియకపోవడం విచారకరమని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యం ఉండడం సహజమని, దేశం కోసం అన్ని పార్టీలు ఏకం కావడం చరిత్ర నిరూపించిందని ఈ సత్యాన్ని బండి సంజయ్ గమనించకపోవడం దారుణమని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశం హాజరయ్యారని, బంగ్లాదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తాము సమర్థిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ కూడా ఈ విషయంలో మాట్లాడరని తెలిపారు. ఇన్ని విషయాలు జరుగుతున్నా తెలుసుకోకుండానే రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనదిగా లేదని, ఆయనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయులు ఏ దేశంలో ఉన్న వారి సంక్షేమం,భద్రతా విషయంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.
మోతిలాల్ నెహ్రూ ఆస్తులను పేదలకు పంచి ఇచ్చారని, స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం జైలుకు సైతం వెళ్లారని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో జవహర్లాల్ నెహ్రూ కూడా జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ జాతీయతను అసలు శంకించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అసలు ఏ విషయంలో కనీస అవగాహన లేకుండానే మాట్లాడడం అలవాటుగా మారిందని, ఇది మార్చుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ కి సూచించారు.
కనీస పరిజ్ఞానం లేకుండా నాలుకకు ఏది వస్తే అది మాట్లాడడం తగదని, ప్రజలు కూడా బండికి నాలెడ్జ్ లేదని గమనిస్తున్నారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.