
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: జిల్లాలో 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు సెషన్లుగా నిర్వహించిన పరీక్షలకు అధికారులు షెడ్యూల్లో పేర్కొన్న సమయానికి అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునీ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాశారు. అభ్యర్థుల హాల్ టికెట్, గుర్తింపు కార్డు పరిశీలించి.. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్షకు అనుమతించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సోమవారం కూడా 144 సెక్షన్ విధించారు.అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ పరీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష ప్రశాంతంగా సాగేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలీసు బందోబస్తు నడుమ పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించారు. గ్రూప్-3 పరీక్ష పూర్తయిన తర్వాత వివిధ పరీక్ష కేంద్రాల నుంచి ఆదివారం, సోమవారం వచ్చిన మూడు సెషన్లకు సంబంధించిన మొత్తం జవాబు పత్రాలకు సీల్ వేసిన అధికారులు వాటిని భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్ కు తరలించారు. ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఏసిపి విజయ్ కుమార్, గ్రూప్-3 పరీక్ష కోఆర్డినేటర్లు వరలక్ష్మి, సతీష్ కుమార్, సీఐలు కోటేశ్వర్, విజయ్ కుమార్, జాన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెoడెంట్ కాళీ చరణ్ తదితరులు పరీక్ష నిర్వహణలో పాల్గొన్నారు.

