మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: నాబార్డు పరిధిలోని రీజినల్ రూరల్ బ్యాంకులన్నింటినీ కలిపి తెలంగాణ స్టేట్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 2025 జనవరి నుంచి అందుబాటులోకి తీసుకురావాలని నాబార్డుకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ర్టాల్లోని ఆర్ఆర్బీలన్నింటినీ ఒకే పెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేసేందుకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ మేరకు తన విజ్ఞప్తులకు స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి బుధవారం బోయినపల్లి వినోద్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్ఆర్బీలు 950పైగా శాఖ లు, 17 ప్రాంతీయ కార్యాలయాలతో రాష్ట్రంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ సమస్య పెండింగ్‌లోనే ఉన్నది. 2024 అక్టోబర్‌లో ఆస్తులు, అప్పుల విభజనకు రెండు తెలుగు రాష్ర్టాలు సమ్మతించడంతో తెలంగాణ స్టేట్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దశాబ్దకాలంగా వినోద్‌కుమార్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తడంతో పాటు డీఎఫ్ఎస్ కార్యదర్శిని కలిసి విన్నవించారు. బ్యాంకు యూనియన్లు నిర్వహించిన సమావేశాలు, ధర్నా ల్లో పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పలుమార్లు వినతులు సమర్పించారు. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని కేంద్రం నాబార్డుకు సూచించింది.