-పలువురు సేదతీరకుండా పాడు పని..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వేసిన సిమెంటు బల్లలను మద్యం బాబులు ధ్వంసం చేసినట్లు పలువురు వాకర్స్ తెలిపారు. వాకర్స్, ప్రజలు సేద తీరేందుకై పలువురు దాతలు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం మైదానంలో సిమెంటు బల్లలు వేయించారు. కాగా గత రెండు రోజుల క్రితం గుర్తు తెలియని మద్యం బాబులు బాస్కెట్ బాల్ కోర్టు ఆవరణలో, వేప చెట్ల కింద ఉన్న సిమెంటు కుర్చీలను ధ్వంసం చేశారు. ఇంతే కాకుండా విద్యుత్ స్తంభాలకు ఉన్న స్విచ్‌లను సైతం పగలగొట్టారని వారు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు శ్రద్ధ వహించి క్రీడా మైదానంలో గస్తీ పెంచీ మద్యం బాబుల ఆగడాలకు అడ్డు కట్ట వేయాలని వారు కోరుతున్నారు. ప్రజల సౌకర్యార్థం దాతలు ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలను ధ్వంసం చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.